సమక్క సాగర్ వద్ద సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం
హెలికాప్టర్‌లో చేరుకుని ప్రాజెక్ట్ పనుల సమీక్ష
సాగునీటి విస్తరణపై అధికారులకు దిశానిర్దేశం
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమీపంలోని సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పీఓ చిత్ర మిశ్రా తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ప్రాజెక్ట్ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎం, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. సమక్క సాగర్ ద్వారా స్థానిక రైతులకు సాగునీటి సౌకర్యం మరింత విస్తరించనుందని అధికారులు తెలిపారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


