కొత్తపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
ఘటనాస్థలంలో వృద్ధుడు మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం హుస్నాబాద్ బీసీ కాలనీకి చెందిన అవదూత శ్రీనివాస్ తన మామ కొండపలకల గ్రామానికి చెందిన శ్రీరాముల రామచంద్రం (75)తో కలిసి ద్విచక్ర వాహనంపై తోటపల్లి గ్రామానికి వెళ్తున్నారు. కొత్తపల్లి శివారులోని రామంచ బస్టాప్ సమీపంలో కరీంనగర్ వైపు నుంచి వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామచంద్రం ఘటనాస్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



