అంజన్న సన్నిధిలో వసూళ్ల దందా..?
టికెట్ ఉన్నా సేవలకు అదనపు వసూళ్లు
తీర్థం నుంచి కొబ్బరికాయ వరకు రేట్లే
గ్లాస్ తీర్థం రూ.20, లీటర్ రూ.100కు విక్రయం
అన్నదానంలో పరిమితి.. భక్తులకు ఇబ్బందులు
ఆలయంలో జరుగుతున్న ఘటనలపై విచారణకు భక్తుల డిమాండ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల నుంచి అదనపు వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్వామి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ కొన్ని సేవల కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దైవసన్నిధిలో ఉచితంగా లేదా అధికారిక టికెట్‌తో లభించాల్సిన సేవలకు కూడా అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఉచితంగా అందాల్సిన తీర్థానికే ధరలు నిర్ణయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లాసు తీర్థానికి రూ.20, లీటర్ బాటిల్‌కు రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు. కొబ్బరికాయ కొట్టేందుకు టికెట్ ఉన్నప్పటికీ అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో పూలు, కొబ్బరికాయలు, తాగునీటి బాటిల్స్ వంటి వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, భక్తుల విశ్వాసాన్ని ఆదాయ వనరుగా మార్చుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అన్నదానంలో పరిమితి.. భక్తులకు ఇబ్బందులు
దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన సత్రంలో పరిమిత సంఖ్యలో మాత్రమే భోజనం అందిస్తున్నట్లు సమాచారం. నిర్ణీత సమయంలో వెళ్లినా టోకెన్లు అయిపోయాయని చెప్పి భోజనం ఇవ్వడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అన్నదాన నిర్వహణలో సరైన సమన్వయం లేదని విమర్శిస్తున్నారు.

అక్రమాలపై విచారణకు డిమాండ్
ఆలయంలో జరుగుతున్న వసూళ్లు, సేవల నిర్వహణపై పారదర్శకత లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ ధరల పెంపు నిర్ణయంపై గతంలో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో, ప్రస్తుతం జరుగుతున్న అదనపు వసూళ్లపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయ నిర్వహణలో పారదర్శకత తీసుకురావడంతో పాటు జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు


