కౌన్సిలర్లు అప్రమత్తం… కమిషనర్ నిర్లక్ష్యం?
డ్రైన్ల నుంచి తీసిన మురికి రోడ్లపైనే… డంపింగ్ యార్డ్‌కు తరలింపు లేదు
పారిశుద్ధ్యంపై కౌన్సిలర్ల చొరవ… అధికారుల అలసత్వంపై ప్రజల ఆగ్రహం
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ మున్సిపాలిటీలో కొత్తగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టిన వెంటనే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తమ వార్డుల్లో పేరుకుపోయిన చెత్త, డ్రైన్లలో ఉన్న మట్టిని తొలగించి మురుగు నీరు సాఫీగా పారేలా చర్యలు చేపడుతున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అయితే ఈ చర్యలకు మున్సిపల్ యంత్రాంగం నుంచి తగిన సహకారం అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

డంపింగ్ యార్డ్‌కు తరలింపులో నిర్లక్ష్యం
కొన్ని వార్డుల్లో కౌన్సిలర్లు స్వంత నిధులతో సీసీ డ్రైన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించి రహదారుల పక్కన గుంపులుగా వేయించారు. అయితే ఈ మురికిని డంపింగ్ యార్డ్‌కు తరలించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదే అయినప్పటికీ ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ సిబ్బందిని సమన్వయం చేసి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. దీంతో డ్రైన్ల నుంచి తీసిన చెత్త రోడ్లపైనే పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది.
డ్రైన్ల నుంచి రోడ్లపైకి మురికి… ప్రజల ఇబ్బందులు
మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల డ్రైన్ల నుంచి తొలగించిన మురుగు మట్టి, వ్యర్థాలు రహదారులపై ఉండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటివరకు డ్రైన్లలో ఉన్న కంపు… ఇప్పుడు రహదారులపై కనిపిస్తుండటం ప్రజలను కలవరపెడుతోంది. కౌన్సిలర్లు చొరవ చూపుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించి, రోడ్లపై పేరుకుపోయిన మురికిని డంపింగ్ యార్డ్‌కు తరలించాలని ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.


