క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందాలి
పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి అవసరం
వీక్లీ పరేడ్ ద్వారా ఐక్యత, సమన్వయం పెరుగుతాయి : అదనపు ఎస్పీ చంద్రయ్య
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : జిల్లా పోలీస్ కార్యాలయ పరిధిలోని పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్, హోమ్ గార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌ను అదనపు ఎస్పీ చంద్రయ్య పరిశీలించి సిబ్బంది ప్రదర్శనను అభినందించారు.
పరేడ్‌లో భాగంగా సిబ్బంది నిర్వహించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్లను ఆయన సమీక్షించారు. సిబ్బంది క్రమశిక్షణ, సమన్వయం, శారీరక దారుఢ్యం అభినందనీయమని పేర్కొన్నారు. వీక్లీ పరేడ్ ద్వారా పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, ఐక్యత పెంపొందడంతో పాటు విధుల నిర్వహణలో సమర్థత పెరుగుతుందని తెలిపారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు ఎస్పీ సూచించారు. ప్రతిరోజూ కనీసం అరగంటపాటు నడక లేదా వ్యాయామం చేయాలని, సాధ్యమైనంతవరకు బయట ఆహారం తీసుకోవడం తగ్గించాలని తెలిపారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. శారీరక దారుఢ్యం ఉన్నప్పుడే విధులను సమర్థవంతంగా నిర్వహించగలమని పేర్కొన్నారు.
ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలి
పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో వ్యవహరించాలని అదనపు ఎస్పీ చంద్రయ్య పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసి శాఖకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పుడైనా తనను సంప్రదించి తెలియజేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐలు కృష్ణ, మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్ఐలు కిరణ్ కుమార్, సాయి కిరణ్, జునైద్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


