ఆర్టీసీ హామీల అమలుకై ‘చలో సెక్రటేరియట్’కు పిలుపు
కాకతీయ, హుజురాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఆధ్వర్యంలో ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 24వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముందుగా హుజురాబాద్ డిపో ఎదుట ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 సంవత్సరానికి సంబంధించిన పే స్కేల్‌పై 30 శాతం పెంపును శాశ్వతంగా అమలు చేయాలని కోరారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించారు.ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని, మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ టీఎస్ సింగ్, కో-చైర్మన్ సాధుల కిషోర్, అంబాల రాజు, పి. రాంబాబు, ఎం. అశోక్, కే. వెంకన్న, వి. తిరుపతి, జి. వీరయ్య, చ. కమలాకర్, జి. శ్రీనివాస్, పి. యాదగిరి, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం పెద్ద సంఖ్యలో హాజరై ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది.


