అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి
రెండు ట్రాక్టర్లు స్వాధీనం నిందితులపై కేసులు నమోదు
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామానికి చెందిన కన్నం రమేష్, తన యజమాని బొమ్మ కిరణ్ ఆదేశాల మేరకు ఇసుక తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అదే విధంగా దుర్షేడ్ గ్రామానికి చెందిన చేను రాజు, తన యజమాని తుమ్మ అశోక్ సూచనలతో మానేరు నది నుంచి అక్రమంగా ఇసుకను తీసుకువస్తూ పోలీసులకు చిక్కాడు.
ట్రాక్టర్ల సీజ్ – కోర్టుకు పంపిణీ
పట్టుబడిన ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసులు నమోదు చేశారు. తదుపరి చర్యల కోసం ట్రాక్టర్లను కోర్టుకు తరలించారు.ఇటీవల ఇదే తరహా కేసులో పట్టుబడిన గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎలవెని అనిల్‌తో పాటు ప్రస్తుత నిందితులను కరీంనగర్ రూరల్ తహసిల్దార్ ముందు హాజరుపరచి రూ.1 లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేశారు.అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.


