పెద్దపల్లిలో ల్యాబ్ టెక్నీషియన్‌లకు ఇండక్షన్ శిక్షణ
కాకతీయ, పెద్దపల్లి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని జిల్లా అధికారుల సముదాయ భవనంలోని (ఐడీఓసీ) మినీ సమావేశ మందిరంలో కొత్తగా నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్‌లకు ఇండక్షన్ శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ నేతృత్వంలో చేపట్టారు.శిక్షణలో భాగంగా వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన డయాగ్నొస్టిక్ పరీక్షలు నిర్వహించే విధానం, రికార్డుల నిర్వహణ, నాణ్యమైన రిపోర్టులు అందించేలా రక్త పరీక్షలు చేపట్టే పద్ధతులు వివరించారు. అలాగే రక్త నమూనాలను సక్రమంగా సేకరించడం, వాటిని తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రానికి సరైన విధంగా పంపించే విధానంపై అవగాహన కల్పించారు.ల్యాబ్ టెక్నీషియన్‌లు రికార్డ్స్ మెయింటెనెన్స్, నమూనాల సేకరణలో నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని శిక్షణలో ప్రాధాన్యంగా సూచించారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య భద్రతలో ల్యాబ్ టెక్నీషియన్‌ల పాత్ర కీలకమని, క్వాలిటీ రిపోర్టుల అందింపులో వారు ముఖ్య బాధ్యత వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి. రాజమౌళి, డాక్టర్ బి. కిరణ్ కుమార్, ఇంచార్జీ ఏఎంఓ ఉమా మహేశ్వర్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


