భూపాలపల్లి జిల్లాలో ఏసీబీ దాడులు
లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది అరెస్ట్..
కాకతీయ, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన ముగ్గురు కోర్టు సిబ్బంది ఎసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్‌తో పాటు పున్నం రజిత, కొమ్ము సునీతలు కలిసి రూ.5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సర్టిఫైడ్ కాపీ అందించేందుకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు సిహెచ్ గోపాలరావు ముందుగా ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు మేరకు ప్రణాళికాబద్ధంగా ట్రాప్ నిర్వహించిన అధికారులు, నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి లంచం నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని విచారణ కోసం కార్యాలయానికి తరలించారు. ఈ ఘటన జిల్లా కోర్టు వర్గాల్లో కలకలం రేపింది. ప్రజలకు న్యాయం అందించాల్సిన కోర్టు సిబ్బంది లంచాలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.



