నాణ్యతపై మిర్చి రైతులకు అవగాహన కల్పించాలి
మార్కెటింగ్ శాఖ అధికారులకు కలెక్టర్ సత్యశారద సూచన
ఏనుమాముల మార్కెట్ ను సందర్శించిన కలెక్టర్
కాకతీయ, వరంగల్ : మిర్చి నాణ్యత ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి అన్నారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. మిర్చి యార్డును పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. మిర్చి దిగుబడి అంచనాలు, ధరల లభ్యత, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు. అనంతరం మార్కెట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సురేఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ ప్రెసిడెంట్ రవీందర్రెడ్డి, వేద ప్రకాష్, వెల్ది సాంబయ్య, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్ మల్లేశంతో సమావేశమయ్యారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధరలు నమోదవుతున్నప్పటికీ, తేమతో కూడిన మిర్చి తీసుకురావడం వల్ల రంగు మారి నాణ్యత తగ్గుతోందని పేర్కొన్నారు. దీంతో ఇతర రాష్ట్రాలు, విదేశీ వ్యాపారులు కొనుగోలుకు నిరాసక్తత చూపుతున్నారని తెలిపారు. రైతులు సరైన ధర కోల్పోకుండా నాణ్యతపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మిర్చి సంచుల బరువు 49 కిలోలకు మించకుండా తీసుకురావాలని, అలా చేస్తే ఎగుమతి, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లభిస్తాయని వివరించారు. గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు సూచనలు:
మార్కెట్కు సరుకు తరలించే ముందు ఇతర మార్కెట్లలో ధరలు తెలుసుకోవాలి. తేమ, చెత్త లేకుండా శుభ్రంగా ఆరబెట్టిన మిర్చినే అమ్మకానికి తీసుకురావాలి రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శారద పేర్కొన్నారు.


