స్వరాజ్య దీప్తి శివాజీ
దేశ గౌరవానికి చిరస్మరణీయ ప్రతీక
స్వరాజ్య స్థాపనతో చరిత్రలో నిలిచిన మహావీరుడు
హిందూ ధర్మ పరిరక్షణలో శివాజీ పాత్ర అపారం
మేయర్ కొలగని శ్రీనివాస్
పద్మనగర్‌లో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
కాకతీయ, కరీంనగర్ : “స్వరాజ్యం” అనే మహత్తర లక్ష్యానికి ప్రాణం పోసి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానేత ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కరీంనగర్ మేయర్ కొలగని శ్రీనివాస్ పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో అపార కృషి చేసి, భారత ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. పట్టణంలోని పద్మనగర్‌లో శివాజీ యువ సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలకు మేయర్ కొలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించిన శివాజీ మహారాజ్ తన ధైర్యసాహసాలు, అసాధారణ నాయకత్వంతో మహాసామ్రాజ్యానికి చత్రపతిగా ఎదిగారని తెలిపారు. ఆయన వ్యక్తిత్వ వికాసంలో తల్లి జిజియాబాయి పాత్ర కీలకమని, శివాజీ చూపిన విలువలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
గెరిల్లా యుద్ధంతో శత్రువులకు చెక్
శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రాలు, గెరిల్లా విధానాలు, దుర్భేద్య కోటల నిర్మాణంతో శత్రువులను తట్టుకుని నిలిచిన మహావీరుడని మేయర్ పేర్కొన్నారు. 1674లో జరిగిన రాజ్యాభిషేకంతో మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాది పడిందని, మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేస్తూ భారత స్వాభిమానాన్ని కాపాడిన నాయకుడిగా శివాజీ నిలిచారని వివరించారు. స్వేచ్ఛ, స్వరాజ్య పరిపాలనపై శివాజీ చూపిన మార్గం దేశానికి ఆదర్శమని, ఆయన ధైర్యం, ధర్మం, పరిపాలనా నైపుణ్యాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం నిర్వాహకులు మేయర్ కొలగని శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ సునీల్ రావులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ గుంజేటి శివ, శివాజీ యువ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, హరికాంత్, ఆదిత్య కిరణ్, అన్వేష్, మనీతో పాటు బీజేపీ నాయకులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


