జాబ్ మేళాతో యువతకు ఉపాధి దారి
ఎస్.ఎస్. డిగ్రీ కళాశాలలో విజయవంతంగా నిర్వహణ
అపోలో ఫార్మసీ, ఎంపవర్, స్టార్ హెల్త్‌లో ఉద్యోగావకాశాలు
15 మంది నిరుద్యోగులకు నియామక పత్రాల అందజేత
కాకతీయ, గీసుగొండ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ధర్మారంలో ఉన్న ఎస్.ఎస్. డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది. ఈ మేళా ద్వారా మొత్తం 15 మంది అభ్యర్థులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ ద్వారా 5 మంది, ఎంపవర్ సంస్థ ద్వారా 5 మంది, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మరో 5 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు కళాశాల ప్రిన్సిపల్ కొక్కొండ శ్రీకాంత్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఇలాంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ప్రతిభకు తగిన అవకాశాలను వినియోగించుకుంటే ఉపాధి సాధన సులభమవుతుందని పేర్కొన్నారు. ఈ మేళాలో హెచ్‌ఆర్ ప్రతినిధులు పాషా, కవిత, ప్రవీణ్, మంగు లాల్, విష్ణు, రాకేష్‌లు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు ప్రణయ్‌తో పాటు కళాశాల సిబ్బంది పాల్గొని జాబ్ మేళా నిర్వహణకు సహకరించారు.


