బండి డ్రామా పాలిటిక్స్
కాంగ్రెస్‌పై బురద జల్లే కుట్ర
బీజేపీ–బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బయటపడుతోంది
ఇండిపెండెంట్లను వలలో వేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం
కరీంనగర్ అభివృద్ధిపై బీజేపీ పూర్తిగా విఫలం
రాష్ట్ర సంక్షేమ పథకాలతో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శలు
కాకతీయ, కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డైవర్ట్ పాలిటిక్స్, డ్రామా రాజకీయాలు బండికి బ్రాండ్‌లా మారాయని, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆయనకు అలవాటైందని మండిపడ్డారు. గురువారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ–బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకున్న బీజేపీ
కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశం నిర్వహిస్తే వెంటనే ఇండిపెండెంట్లకు బీజేపీ కండువాలు కప్పించి రాజకీయ డ్రామా సృష్టించడం సిగ్గుచేటని నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల అసలు సమస్యలపై స్పందించాల్సిన బీజేపీ నాయకులు రాజకీయ నాటకాలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్‌పై నిరాధార ఆరోపణలు చేయడం వారి అసమర్థతకు నిదర్శనమని అన్నారు. కరీంనగర్ ప్రజలు బీజేపీకి ఎంపీ, ఎమ్మెల్సీ, మేయర్ వంటి కీలక పదవులు ఇచ్చినా నగర అభివృద్ధి విషయంలో ఒక్క గణనీయమైన పనీ జరగలేదని నరేందర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ సంక్షేమంతో ప్రజల్లో విశ్వాసం
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, బీజేపీ మాత్రం రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తోందని అన్నారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపు పెరుగుతుండటంతో బీజేపీ అసత్య ప్రచారాలకు దిగుతోందని విమర్శించారు.బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, కరీంనగర్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, గంట శ్రీనివాస్, వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


