జమ్మికుంటలో షూ మార్టుల్లో ఘరానా మోసం
ఎంఆర్పీ తొలగించి అధిక ధరలతో విక్రయాలు
ప్రశ్నిస్తే కస్టమర్లతో దురుసు ప్రవర్తన
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ సమీపం, గాంధీ చౌరస్తా ప్రాంతాల్లో నడుస్తున్న కొన్ని షూ మార్ట్ దుకాణాలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చెప్పులు కొనుగోలు చేసేందుకు వచ్చే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల వాదన ప్రకారం, చెప్పుల బాక్స్‌పై కంపెనీ ముద్రించిన అసలు ఎంఆర్పీ స్టిక్కర్‌ను తొలగించి, దాని స్థానంలో షాప్ యాజమాన్యం స్వయంగా ముద్రించిన అధిక ధర స్టిక్కర్‌ను అతికించి విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది వినియోగదారుల హక్కులకు విరుద్ధమైన చర్యగా, స్పష్టమైన మోసంగా భావిస్తున్నారు. అసలు ధర గురించి కస్టమర్లు ప్రశ్నిస్తే, “మేము చెప్పులు అమ్మము… వెళ్లండి” అంటూ దుకాణ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు బాధితులు చెబుతున్నారు. వ్యాపార సంస్థలు వినియోగదారులకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు తక్కువ ధరలో చెప్పులు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో షాపులకు వెళ్తే, అధిక ధరలు చెప్పడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా పాఠశాల పిల్లల కోసం చెప్పులు కొనుగోలు చేయడానికి వచ్చిన తల్లిదండ్రులు కూడా మోసపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించి, అక్రమాలకు పాల్పడుతున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


