కాకతీయ ఎఫెక్ట్…
సర్పంచుల శిక్షణలో భర్తలు బయటనే
ఆమె సర్పంచ్.. ఆయనకు శిక్షణ కథనంపై డీపీవో సీరియస్
మహిళా సర్పంచ్‌ల స్థానంలో భర్తల హాజరుపై అధికారుల అప్రమత్తత
ఐడి కార్డు చూసి శిక్షణకు అనుమతించిన అధికారులు
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలతో పకడ్బందీ చర్యలు
మూడో రోజు సజావుగా కొనసాగిన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమం
సంచలనం రేపిన కాకతీయ కథనం
కాకతీయ, దుగ్గొండి : మహిళా సర్పంచ్‌లకు బదులుగా వారి భర్తలు శిక్షణకు హాజరవుతున్నారనే విషయం కాకతీయ వెలుగులోకి తీసుకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహిళా ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఇతరులను అనుమతించకూడదని కఠిన చర్యలు చేపట్టారు. గంగదేవిపల్లి గ్రామంలో జరుగుతున్న ఐదు రోజుల శిక్షణా శిబిరంలో మూడో రోజు నుంచి కట్టుదిట్టమైన తనిఖీలు అమలు చేశారు. గేటు వద్దనే సర్పంచ్‌ల ఐడి కార్డు, ఆధార్ కార్డు పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించారు. సర్పంచ్‌లు తప్ప కుటుంబ సభ్యులు, ఇతరులకు ప్రవేశం నిరాకరించారు. దీంతో గతంలో నెలకొన్న పరిస్థితులకు పూర్తిగా చెక్ పడింది. మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు శిక్షణకు హాజరవుతున్నారనే విషయం వెలుగులోకి రావడంతో జిల్లా పంచాయతీ అధికారి తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా మందలించి, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేసినట్లు సమాచారం. శిక్షణా కార్యక్రమాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలతో అప్రమత్తం
ఈ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం కూడా స్పందించినట్లు సమాచారం. మహిళా సర్పంచ్‌ల స్థానంలో ఇతరులు హాజరవడం సహించబోదని, బాధ్యులపై చర్యలు తప్పవని జిల్లా అధికారులకు సూచనలు అందినట్లు తెలిసింది. ఈ మేరకు శిక్షణా కేంద్రాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మహిళా సర్పంచ్‌లు స్వయంగా పాలన నిర్వహించేలా అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో మూడో రోజు శిక్షణా కార్యక్రమం సజావుగా కొనసాగింది. మహిళా సర్పంచ్‌లే ప్రత్యక్షంగా పాల్గొనడంతో శిక్షణ లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో ఇతరులు వ్యవహరించకుండా నిరోధించేందుకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.


