కాకతీయ కాలువలో వివాహిత మృతదేహం లభ్యం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామానికి చెందిన పోలవేణి అనుష మృతదేహం కాకతీయ కాలువలో లభ్యమైంది.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం ప్రకారం, గత జులై 2025లో పోలవేణి రాజుతో అనుషకు వివాహం జరిగింది. కొద్దిరోజుల క్రితం దేవంపల్లికి వచ్చిన ఆమె, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కాలువ సమీపంలో ఆమె చెప్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రంగపేట శివారులో కాలువలో అనుష మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది ఆత్మహత్యా, ప్రమాదమా, లేక ఇతర కారణాలున్నాయా అన్న దానిపై విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


