తొర్రూరు మున్సిపాలిటీలో లక్కీ డ్రా వివాదం
డ్రా వీడియో వైరల్… అధికారులపై బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్‌కు అనుకూలంగా చిట్టీలు సిద్ధం చేశారంటూ విమర్శలు
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కుట్ర జరిగిందని ఆగ్రహం
కాకతీయ, తొర్రూరు : తొర్రూరు మున్సిపాలిటీలో నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియపై తీవ్ర వివాదం నెలకొంది. డ్రా ప్రక్రియకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అధికారుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ముందుగానే కుట్ర పన్ని డ్రా నిర్వహించారని వారు ఆరోపించారు. లక్కీ డ్రా కోసం ఉపయోగించిన చిట్టీల్లో అసమానతలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించిన చిట్టీలను సన్నగా మడిచారని, కాంగ్రెస్ అభ్యర్థుల చిట్టీలను మాత్రం లావుగా మడిచి సులభంగా గుర్తించేలా చేశారని ఆరోపించారు.

డ్రా సమయంలో అధికారులు వెతికి మరీ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టీలను ఎంపిక చేశారని విమర్శించారు. డ్రా ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరగలేదని, అధికారులే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కేలా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికలను ఒక రోజు వాయిదా వేయడం కూడా ఇదే కుట్రలో భాగమని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వైరల్ చేస్తున్నారు. డ్రా ప్రక్రియపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదంపై ఎన్నికల అధికారులు లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.



