కాకతీయ కథనానికి స్పందన
వేములవాడ ఎగ్జిబిషన్లో భిక్షాటన చేస్తున్న బాలుడు రక్షణ
సీడబ్ల్యూసీ ముందు హాజరు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : వేములవాడలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ప్రాంగణంలో గాంధీ వేషధారణలో భిక్షాటన చేస్తున్న బాలుని విషయంపై ప్రచురితమైన కాకతీయ కథనానికి అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది.వేములవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గాంధీ వేషధారణలో ఒక బాలుడు యాచిస్తున్నట్లు కాకతీయ లో బుధవారం ప్రచురితమైన ” ఎగ్జిబిషన్ లో బాల కార్మికులు” అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు మిషన్ వాత్సల్య బృందం మరియు చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.బాలుడిని వెంటనే రక్షించి, బాలల సంక్షేమ సమితి ముందు హాజరుపరిచారు. సమితి ఆదేశాల మేరకు బాలుడికి కౌన్సిలింగ్ నిర్వహించి, అతని భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలకు పంపించేలా చర్యలు తీసుకుంటూ తల్లిదండ్రులకు అప్పగించారు.ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తల్లిదండ్రులపై జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించినట్లు జిల్లా సంక్షేమ అధికారి పీ. లక్ష్మీరాజ్యం తెలిపారు.బాలల హక్కుల పరిరక్షణలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ఎవరైనా బాల కార్మికత్వం లేదా భిక్షాటనకు గురైన పిల్లలను గమనించిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి సమాచారం అందించాలని ఆయన కోరారు.


