రాజ్యసభలో ఎవరికి ఛాన్స్..?
రెండు స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
జీవన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్న సంకేతాలు
వైఎస్ షర్మిల పేరు కూడా చర్చల్లోకి రావడంతో ఆసక్తి
స్థానికులకు ప్రాధాన్యమా.. జాతీయ నేతలకు అవకాశమా?
సామాజిక సమీకరణాలపై అధిష్టానం కసరత్తు
కాంగ్రెస్ నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నుంచి ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. 2026 రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేగం పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు కాంగ్రెస్ ఎవరిని ఎంపిక చేస్తుందన్నదే ప్రస్తుతం ప్రధాన చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల జగిత్యాల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతుండగా, ఆయనను బుజ్జగించేందుకు రాజ్యసభ సీటు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన నాయకుడిగా జీవన్‌రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
షర్మిల పేరు కూడా చర్చల్లోకి.. సమీకరణాలపై కసరత్తు
మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపించడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో బలం లేకపోవడంతో ఆమెను ఇతర రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించే అవకాశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆమెను ఎంపిక చేసే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే తెలంగాణకు చెందిన నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మనూ సింగ్‌వీని రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే. ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాకపోవడంతో రాష్ట్ర నాయకుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈసారి స్థానిక నాయకుడికి అవకాశం ఇస్తారా లేక మళ్లీ జాతీయ నాయకుడిని ఎంపిక చేస్తారా అన్నది కీలకంగా మారింది.
సామాజిక సమీకరణాలే కీలకం
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ వర్గాలకు చెందిన నాయకుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే నాయకుడిని ఎంపిక చేస్తారా లేక జాతీయ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ఇలా
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26, 2026
నామినేషన్ల దాఖలు చివరి తేదీ: మార్చి 5, 2026
నామినేషన్ల ఉపసంహరణ గడువు: మార్చి 9, 2026
పోలింగ్: మార్చి 16, 2026 (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు)
ఫలితాల ప్రకటన: మార్చి 16, 2026 (సాయంత్రం 5 గంటలకు)


