కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్
అప్రమత్తమైన పోలీసులు – ఖాళీ చేసిన కోర్టు ప్రాంగణం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కోర్టును పేల్చివేస్తామని పేర్కొంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ నగరంలో తీవ్ర కలకలం రేపింది. బుధవారం కోర్టుకు ఈమెయిల్ ద్వారా వచ్చిన హెచ్చరికతో పోలీసులు వెంటనే అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ బృందాలతో కలిసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టు గదులు, కారిడార్లు, వాహన పార్కింగ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను ప్రాథమికంగా ఆకతాయిల చేష్టగా పోలీసులు భావిస్తున్నారు. బెదిరింపు మెయిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ పంపిన ఐపీ అడ్రస్, సర్వర్ వివరాలను సేకరించేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


