బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు
మానకొండూరులో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ అవగాహన సదస్సు
కాకతీయ, కరీంనగర్ : బాలల హక్కులను ఉల్లంఘించే చర్యలపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని, బాలల రక్షణకు న్యాయవ్యవస్థ అజేయ కవచంలా నిలుస్తుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. మానకొండూరులోని పీఎంస్రీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం భాగంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విద్యార్థులకు బాలల హక్కులు, చట్టపరమైన రక్షణ అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ద్వారా ఇలాంటి అక్రమాలను అరికట్టవచ్చని వివరించారు. బాలలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు అమల్లో ఉన్న పోక్సో చట్టం ప్రాముఖ్యతను తెలియజేశారు. అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల ముప్పు నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. చట్టం అందరికీ సమానమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్, యస్‌వీఆర్ కృష్ణ, బలుసుల శాంతి కుమార్, తిరుమణి అశ్విని, కొత్తకొండ శంకర్, దుంపేటి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు దాసి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ఉపాధ్యాయులు దీపారాణి, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాలకు న్యాయవాదులు సమాధానాలు ఇవ్వగా, ఈ సదస్సు వారిలో చట్టపరమైన అవగాహన పెంపొందించిందని ఉపాధ్యాయులు తెలిపారు.


