రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణం చెల్లించాలి
టాప్రా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్
కాకతీయ, కరీంనగర్ :పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే ఒకేసారి విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ధర్నాలో టాప్రా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 2024 నుంచి పదవీ విరమణ పొందిన అనేకమందికి ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని తెలిపారు. ఆర్థిక ఒత్తిడితో కొందరు పెన్షనర్లు మనోవేదనకు గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
దశలవారీ చెల్లింపులు కాకుండా అన్ని బకాయిలను ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్ మాట్లాడుతూ జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేసి, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. గౌరవాధ్యక్షుడు కట్ట నాగభూషణాచారి మాట్లాడుతూ పెన్షనర్లందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో జిల్లా కోశాధికారి ఇరువంటి తిరుమలయ్య, హుజురాబాద్ శాఖ అధ్యక్షుడు భారత ప్రభాకర్, గాజర్ల బుచ్చిరాజం, చీకట్ల సమ్మయ్య, మండల వీరస్వామి, బొంగోని వెంకటయ్య, తాటిపాముల కనకయ్య, దొంత హరికిషన్, గౌరీశెట్టి సాంబయ్య, జమ్మికుంట శాఖ నేతలు గరిగ చంద్రయ్య, ఉమాదేవి, మేక మల్ల సుధాకర్, మారేపల్లి మొగిలయ్య, ముక్కా ఐలయ్య తదితరులు పాల్గొన్నారు


