కొమ్మాల జాతర పోస్టర్ ఆవిష్కరణ
ఈ నెల 23 నుంచి బ్రహ్మోత్సవాల ప్రారంభం
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
అధికార యంత్రాంగానికి మంత్రి కొండా సురేఖ ఆదేశం
కాకతీయ, గీసుగొండ : కొరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన కొమ్మాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా జాతర గోడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, జాతరకు విచ్చేసే భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత వంటి అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. జాతరను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి, గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, ఊకల్ సొసైటీ మాజీ చైర్మన్ కక్కెర్ల శ్రీనివాస్, ఆలయ ఈఓ ప్రసాద్, అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


