కాకతీయ కథనంతో కదిలిన ఎక్సైజ్ శాఖ
ఏటూరునాగారంలో రాత్రి ఆకస్మిక దాడులు
గుడుంబా తయారీ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు
అక్రమ మద్యం నిర్మూలనకు చర్యలు ముమ్మరం
నిరంతర దాడులతో సమస్యకు చెక్ పెట్టాలని ప్రజల డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే అంశంపై కాకతీయ దినపత్రికలో వెలువడిన కథనం ఎక్సైజ్ శాఖను కదిలించింది. కథనం వెలువడిన వెంటనే అప్రమత్తమైన అధికారులు మంగళవారం రాత్రి ఏటూరునాగారం కేంద్రంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్సై వీరస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. గుడుంబా తయారీకి వినియోగించే సామగ్రి, నిల్వలపై దృష్టి సారించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. గ్రామాల పరిసర ప్రాంతాల్లోనే అక్రమంగా గుడుంబా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి బహిరంగంగానే విక్రయాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇటీవల గ్రామాల్లో గుడుంబా విక్రయాలు పెరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకతీయలో కథనం ప్రచురితమైన వెంటనే ఎక్సైజ్ శాఖ స్పందించి చర్యలు ప్రారంభించడం గమనార్హం. అయితే దాడులు ఒక్కరోజుతో పరిమితం కాకుండా నిరంతరం కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యం, గ్రామాల్లో శాంతి భద్రతల కోసం అధికారులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


