మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు
12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేత
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం ప్రత్యేక నిర్వహణ
ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలల్లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక షెడ్యూల్
పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. పరీక్షలున్నంతకాలం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
వేసవి సెలవుల షెడ్యూల్
విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 12 నుంచి 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని వెల్లడించారు. రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలలు, డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కోల్పోయిన బోధనా సమయాన్ని భర్తీ చేసేందుకు మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.


