ఆర్టీఐతో జవాబుదారీతనం
సమాచారం అందించడమే లక్ష్యం
8 నెలల్లో 9 వేల ఆర్జీల పరిష్కారం
పెండింగ్ కేసులను పూర్తిగా క్లియర్ చేస్తాం
రాష్ట్ర సమాచార కమిషనర్లు
సమాచార అధికారులకు అవగాహన
కాకతీయ, కరీంనగర్ : అధికారుల్లో జవాబుదారితనం పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర సమాచార కమిషనర్లు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులకు కోరిన సమాచారాన్ని సమయానికి అందించడం కమిషన్ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్యరెడ్డి, మోసినా పర్వీన్, దేశాల భోపాల్ మీడియాతో మాట్లాడారు. 2025 మే 14న బాధ్యతలు స్వీకరించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 17,808 రెండవ అప్పిళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గత ఎనిమిది నెలల్లో 15 జిల్లాల్లో పర్యటించి అక్కడికక్కడే వాదనలు విని సుమారు 9 వేల అప్పిళ్లను పరిష్కరించామని వెల్లడించారు. ఇంత తక్కువ కాలంలో ఇంత భారీ సంఖ్యలో అప్పిళ్లను పరిష్కరించడం దేశంలోనే అరుదైన విషయమని పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసులను జీరో స్థాయికి తీసుకువచ్చామని తెలిపారు. సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని, త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ పర్యటించి పెండింగ్ కేసులను పూర్తిగా క్లియర్ చేస్తామని చెప్పారు.
అధికారులకు అవగాహన
ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల ప్రయోజనం కోసమేనని కమిషనర్లు పేర్కొన్నారు. ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులతో ఆర్టీఐ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దరఖాస్తుల స్వీకరణ, కోరిన సమాచారం అందజేయడం, అప్పిళ్లు, పరిష్కార ప్రక్రియ వంటి అంశాలు నిరంతర బాధ్యతలని తెలిపారు. దరఖాస్తుదారు సమాచారం కోరినప్పుడు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్‌బాబు, అదనపు డీసీపీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


