భద్రకాళి బండ్‌పై అంతరిక్ష సంబరం
‘ఎక్స్‌ప్లోరా–2026’కు ఘనంగా శ్రీకారం
ఫిబ్రవరి 18 నుంచి 27 వరకు స్టార్ గేజింగ్ కార్యక్రమాలు
నాలుగు ప్రొఫెషనల్ టెలిస్కోపులతో చంద్రుడు, గ్రహాల పరిశీలనకు అవకాశం
రుద్రమ వి.01 మోడల్ రాకెట్ ప్రయోగం ప్రధాన ఆకర్షణ
ఇస్రో మిషన్ గ్యాలరీతో అంతరిక్ష ప్రయాణం ప్రత్యక్ష అనుభూతి
విద్యార్థుల్లో శాస్త్రం, రాకెట్రీపై ఆసక్తి పెంపే లక్ష్యం
వరంగల్‌ను స్పేస్ ఎడ్యుకేషన్, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పం
కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో : జాతీయ సైన్స్ డే సందర్భంగా వరంగల్ నగరంలో అంతరిక్ష విజ్ఞానానికి కొత్త దారులు తెరుచుకున్నాయి. ‘ఎక్స్‌ప్లోరా–2026 స్పేస్‌స్టెమ్ డ్రైవ్’లో భాగంగా ఫిబ్రవరి 18 నుంచి 27 వరకు వరంగల్ భద్రకాళి బండ్ వద్ద ప్రజల కోసం ప్రత్యేక స్టార్ గేజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కుడా ఆధ్వర్యంలో, ఏటిడిఆర్‌ఎల్ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్, ఇస్రో రిజిస్టర్డ్ స్పేస్ ట్యూటర్ శశాంక్ భూపతి, ఎన్‌ఐటి వరంగల్ అకడమిక్ భాగస్వామ్యంతో, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు. కుడా వైస్ ఛైర్మన్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయి, ఎన్‌ఐటి డైరెక్టర్ బిద్యాధర్ సుబుద్ధి, ఇస్రో–ఎన్‌ఐటి నోడల్ అధికారి ఆంజనేయులు కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు.
టెలిస్కోపులతో ప్రత్యక్ష ఖగోళ వీక్షణ
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా నాలుగు ప్రొఫెషనల్ ఖగోళ టెలిస్కోపులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలు, విద్యార్థులు చంద్రుడు, గ్రహాలు మరియు లోతైన ఆకాశ వస్తువులను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పించారు. అంతేకాకుండా వరంగల్‌లో ఏర్పాటు చేసిన ఇస్రో మిషన్ గ్యాలరీలో రాకెట్ మోడల్స్, ఉపగ్రహ నమూనాలు ప్రదర్శిస్తూ భారత అంతరిక్ష ప్రయాణాన్ని సులభంగా అర్థమయ్యేలా చూపిస్తున్నారు. ఈ స్పేస్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా “రుద్రమ వి.01” మోడల్ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. ఇది విద్యార్థులు, ప్రజలకు రాకెట్లు ఎలా పనిచేస్తాయో అర్థమయ్యేలా రూపొందించిన విద్యాపరమైన నమూనా. ఈ ప్రయోగం ద్వారా పిల్లల్లో శాస్త్రంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు “నేనూ రాకెట్ తయారు చేయగలను” అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రాకెట్రీ, ఉపగ్రహ రూపకల్పన, రోవర్ కాన్సెప్ట్లు, భవిష్యత్ అంతరిక్ష నివాసాలపై అవగాహన కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలను కూడా ఈ శాస్త్రయాత్రలో భాగస్వామ్యం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
వరంగల్‌ను స్పేస్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం
ప్రస్తుతం భారత అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ సుమారు 8 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉండగా, 2033 నాటికి ఇది 44 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అంతరిక్ష రంగంలో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా అంతరిక్ష విద్యను విస్తరించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని, ఎక్స్‌ప్లోరా కార్యక్రమాన్ని దీర్ఘకాలికంగా కొనసాగిస్తూ వరంగల్‌ను అంతరిక్ష విద్య, పరిశోధన మరియు తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు.


