ఇల్లంతకుంట మండలంలో పులి దాడి కలకలం
మూడు ఆవులు, ఒక ఆవు దూడ మృతి
గ్రామాల్లో భయాందోళన
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పపూర్ గ్రామ శివారులో పులి దాడి కలకలం రేపింది.పెద్దలింగాపూర్‌కు చెందిన రైతులు గుర్రాల మల్లయ్యకు చెందిన మూడు ఆవులు, వోరెం సుధాకర్‌కు చెందిన ఒక ఆవు దూడపై సోమవారం రాత్రి పెద్ద పులి దాడి చేసి హతమార్చింది.తిప్పపూర్ – పెద్దలింగాపూర్ రహదారిపై కల్వర్టు సమీపంలోని గుట్టలను ఆనుకుని ఉన్న పొలాల వద్ద కట్టి వేసిన పశువులపై పులి దాడి చేసినట్లు తెలుస్తోంది. ₹మంగళవారం ఉదయం రైతులు పొలాలకు వెళ్లి చూడగా, పశువులు మెడ భాగంలో గాయాలతో మృతి చెందినట్లు గుర్తించారు.గత వారం రోజులుగా కోహెడ మండలం పరిసరాల్లో పులి సంచారం ఉందన్న సమాచారం ప్రజల్లో ఆందోళన కలిగించింది.అలాగే చిన్నకోడూరు మండలం విఠలాపూర్, కిష్టాపూర్ గుట్టల వద్ద పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లోనే తిప్పపూర్ శివారులో జరిగిన తాజా ఘటన గ్రామాల్లో భయాందోళనకు దారితీసింది. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ మరియు పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. అక్కడ పెద్ద పులి పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.కాగా, కోహెడ ప్రాంతంలో సంచరించిన పులి ఇదేనా? లేక వేరే పులి దాడి చేసిందా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అటవీ శాఖ పరిశీలన అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి.



