తండ్రి చేతిలో కుమారుడి దారుణ హత్య
మానకొండూరులో విషాదం
పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కుమారుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం సంచలనంగా మారింది.మంగళవారం ఉదయం పూరం కనకయ్య అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తన కుమారుడు పూరం శ్రీనివాస్ (35)ను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అనుమానం కలిగిన పోలీసులు వెంటనే అతనితో పాటు వచ్చిన వ్యక్తిని తీసుకుని ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ శ్రీనివాస్ తలపై తీవ్ర గాయాలతో మృతదేహంగా కనిపించాడు.
పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, శ్రీనివాస్‌కు వివాహం కాలేదు. తండ్రి-కొడుకులు ఒకే గదిలో నివసిస్తుండగా, మరో కుమారుడు, కోడలు పక్క గదిలో ఉంటున్నారు. శ్రీనివాస్ ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి తండ్రితో గొడవపడుతుండేవాడని, ఈ కారణంగా ఇంట్లో తరచూ వివాదాలు నెలకొనేవని సమాచారం.సోమవారం రాత్రి కూడా మద్యం సేవించి వచ్చి తండ్రితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. అనంతరం రాత్రి నిద్రలో ఉన్న సమయంలో ఇంటి పక్కనే ఉన్న బండరాయితో తలపై బలంగా కొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై మరో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


