నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు
*స్వామి వారిని దర్శించుకున్న
*తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి
కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మాఘమాస భౌమ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని ఊకల్ హావేలి గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, చతుర్వేద పారాయణంతో విశేష ఆర్చనలు చేశారు. అనంతరం వివిధ రకాల సుగంధ పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో కళకళలాడింది.ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష, ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు,కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, గ్రామ సర్పంచ్ కక్కెర్ల సుభాష్, ఉప సర్పంచ్ జన్ను సుధాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగరాజు, సాపిత రఘు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



