ములుగులో ఇసుక లారీల అతి వేగం
ప్రమాదాలకు తెరలేపుతున్న అక్రమ రవాణా
అధిక లోడుతో రోడ్లపై దూసుకెళ్తున్న లారీలు
వరుస ఘటనలతో భయాందోళనలో ప్రజలు
ఫిర్యాదులున్నా స్పందించని అధికారులు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా పరిధిలో ఇసుక లారీలు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో రహదారులపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అనుమతించిన పరిమితికి మించి ఇసుకను తరలించడం వల్ల రహదారులు దెబ్బతినడంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తాడ్వాయి మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామం మధ్యలో గొర్రెల గుంపుపై ఇసుక లారీ దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పినా, కొన్ని పశువులకు నష్టం జరిగినట్లు సమాచారం. అలాగే మరో ఘటనలో మిర్చి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఇసుక లారీ ఢీకొట్టడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. అధిక లోడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
రాత్రివేళల్లో అక్రమ రవాణా జోరు
ప్రత్యేకంగా రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా నిర్భయంగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. అధిక లోడుతో వెళ్తున్న లారీల వల్ల రహదారులు త్వరగా పాడవుతున్నాయని, ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి, అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


