కాకతీయ, నేషనల్ డెస్క్: భారీ వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు జమ్మూకశ్మీర్ లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు విమానాలను అధికారులు క్యాన్సిల్ చేశారు. దీంతో ప్రముఖ నటుడు మాధవన్ లేహ్ లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. వర్షాల కారణంగా విమానాలు క్యాన్సిల్ అవ్వడంతో లేహ్ లోనే ఉండిపోవల్సి వచ్చిందన్నారు. ఇది 17ఏళ్ల నాటి సంగతిని గుర్తుచేసిందని చెప్పుకొచ్చారు. తాను లఢఖ్ ను సందర్శించిన ప్రతిసారీ ఈ విధంగానే జరుగుతుందని తెలిపారు.
2008లో త్రీ ఇడియన్స్ మూవీ షూటింగ్ కోసం లఢఖ్ వచ్చినప్పుడు కూడా ఈ విధంగానే జరిగిందని మాధవన్ చెప్పుకొచ్చారు. అప్పుడు విపరీతంగా మంచు కురవడంతో ఎయిర్ పోర్టులు మూసివేశారని వివరించారు. దీంతో షూటింగ్ కోసం వచ్చిన నటీనటుల బ్రుందం మొత్తం ఇక్కడే ఉండిపోవల్సి వచ్చిందన్నారు. అయితే ఈ ప్రాంతం ఎలా ఉన్నా అందంగానే ఉంటుందని మాధవన్ వివరించారు.


