ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో
నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
కాకతీయ,నల్లబెల్లి : మండలంలోని బిలనాయక తండా శివారులో జాతీయ రహదారి–365పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి–కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. రహదారి పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. నర్సంపేట నుంచి అడవి మల్లంపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ అకస్మాత్తుగా రహదారిపై ఆగిపోవడంతో వెనుక నుంచి వచ్చిన ఆటో అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టినట్లు సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో గూడూరు మండలం మట్టవాడ గ్రామానికి చెందిన హరిబండి రత్నమ్మ (50), హరిబండి సునీల్ (30) తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


