కేసముద్రం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సునీత
వైస్ చైర్మన్‌గా అల్లం రమ నాగేశ్వర్
మెజారిటీతో పీఠం కాంగ్రెస్ కైవసం
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ
సంబరాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ శ్రేణులు
పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని నూతన పాలకవర్గం హామీ
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కీలక విజయాన్ని నమోదు చేసుకుంది. చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ సునీత వెంకన్న ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా అల్లం రామ నాగేశ్వర్ ఎంపికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. చైర్మన్ ఎన్నికలో బానోత్ సునీత వెంకన్నకు మెజారిటీ కౌన్సిలర్ల మద్దతు లభించింది. పార్టీ ఉన్నత నాయకత్వం సూచనలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కౌన్సిలర్ల పూర్తి మద్దతుతో ఆమె విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చాటింది. అలాగే వైస్ చైర్మన్ పదవికి అల్లం రామ నాగేశ్వర్ పేరు ప్రతిపాదించగా, సభ్యుల మద్దతుతో ఆయన ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పాలనకు మార్గం సుగమమైంది.

అభివృద్ధే లక్ష్యమని నూతన చైర్మన్ స్పష్టం
చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం బానోత్ సునీత వెంకన్న మాట్లాడుతూ కేసముద్రం పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తాగునీటి సమస్యల పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, రహదారుల మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ అల్లం రామ నాగేశ్వర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో చైర్మన్‌తో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని, పట్టణంలో మౌలిక వసతుల విస్తరణకు కృషి చేస్తామని చెప్పారు.
సంబరాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పూలమాలలు వేసి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్థిరపడగా, పట్టణ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


