పరకాల మునిసిపల్ చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్
మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఆదర్శ పట్టణంగా పరకాలను తీర్చిదిద్దుతాను
పారదర్శక పాలన, అభివృద్ధే లక్ష్యమని స్పష్టం
డ్రైనేజీ, తాగునీరు, రహదారులపై ప్రత్యేక దృష్టికి హామీ
నూతన ఛైర్మన్‌కు నాయకులు, ప్రజల శుభాకాంక్షలు
కాకతీయ, పరకాల : పరకాల పురపాలక సంఘం నూతన ఛైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారుల సమక్షంలో ఆయన పదవీ ప్రమాణం చేసి అధికార బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు హాజరై నూతన ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ప్రమాణ స్వీకారం అనంతరం పావుశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శకమైన, ప్రజాకేంద్రీకృత పాలన అందించడం తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. పట్టణ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
పరకాల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా బలోపేతం, రహదారుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ వంటి కీలక సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు అమలు చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల సహకారంతో పరకాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నూతన ఛైర్మన్‌కు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.


