జనగామలో చైర్మన్ ఎన్నికపై టెన్షన్
వాయిదా వేయాలంటూ ఎంపీ డిమాండ్
బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ ఆరోపణలతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన
ఎన్నికను వారం రోజుల పాటు వాయిదా వేయాలని అధికారులతో వాగ్వాదం
కోరం పూర్తయిందని… ఎన్నిక వాయిదా అసాధ్యమని స్పష్టం చేసిన అధికారులు
తాను కిడ్నాప్ కాలేదని కార్యాలయానికి చేరుకుని ప్రకటించిన కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా
హంగ్ పరిస్థితుల్లో చైర్మన్ పీఠం కోసం ఉత్కంఠభరిత సమీకరణాలు
మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
కాకతీయ, జనగామ : జనగామ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికను వాయిదా వేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులతో వాగ్వివాదానికి దిగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. బీఆర్ఎస్‌కు చెందిన 28వ వార్డు కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ అయ్యారని, ఆమెపై మిస్సింగ్ కేసు నమోదైందని ఆరోపిస్తూ ఎన్నికను కనీసం వారం రోజుల పాటు వాయిదా వేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. హఫీజ్ ఫాతిమా ఆచూకీ తెలియకుండా ఉండగా ఎన్నిక నిర్వహించడం సరైంది కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రిసైడింగ్ అధికారులతో ఆయన తీవ్ర వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. ఎన్నిక ప్రక్రియను నిలిపివేసి కౌన్సిలర్ ఆచూకీపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని ఆయన పట్టుబట్టారు.
కోరం పూర్తయింది… ఎన్నిక వాయిదా అసాధ్యం
అయితే ఎన్నికకు అవసరమైన కోరం పూర్తిగా ఉన్నందున నిబంధనల ప్రకారం ఎన్నికను వాయిదా వేయడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా స్వయంగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తాను కిడ్నాప్ కాలేదని ప్రకటించారు. తాను సురక్షితంగానే ఉన్నానని, ఎవరూ తనను బలవంతంగా ఎక్కడికీ తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. తాను గెలిచిన బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తానని ప్రకటించడం రాజకీయంగా కీలకంగా మారింది.
హంగ్ పరిస్థితుల్లో ప్రతి ఓటు కీలకం
జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు నలుగురు కీలకంగా మారగా, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓట్లు కూడా చైర్మన్ ఎన్నికలో నిర్ణయాత్మకంగా మారనున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో చైర్మన్ పీఠం ఎవరి ఖాతాలో పడుతుందన్నది ఉత్కంఠగా మారింది.


