కమిషనరేట్‌లో ఆంక్షలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమలు
ముగ్గురిపైగా గుమిగూడటంపై నిషేధం
ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలి
కమిషనర్ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఉప మేయర్, అలాగే మున్సిపాలిటీల ఛైర్మన్, ఉప ఛైర్మన్ పరోక్ష ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 బిఎన్‌ఎస్‌ఎస్ (గతంలో 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటంపై నిషేధం విధించారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 16 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 17 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి.శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, సైనిక సిబ్బంది, హోంగార్డులు, అంత్యక్రియల ఊరేగింపులు, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వైద్య, అత్యవసర సేవలకు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు.


