ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
ఇనుగుర్తిలో భారీ ఊరేగింపు, ప్రత్యేక పూజలు
ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవు ప్రకటించాలని డిమాండ్
కాకతీయ,ఇనుగుర్తి : బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో లంబాడీలు భారీ ఊరేగింపుతో జయంతిని వైభవంగా జరుపుకున్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సంఘం అధ్యక్షుడు, సర్పంచ్ జాటోత్ హరిచంద్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఐక్యత, సంస్కృతికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించి ఘనంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మండలంలోని మిట్యా తండా తదితర తండాలలో కూడా జయంతి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం ప్రతినిధులు, బంజారా నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


