కాంగ్రెస్‌లో ‘షేర్’ ఫార్ములా ?
ములుగు చైర్మన్ పీఠానికి ఇద్దరికీ అవకాశం?
కాంగ్రెస్ క్యాంపులో ఉత్కంఠ రేపుతున్న పరిణామాలు
స్వాతి, చంద్రకళల మధ్య పదవి పంపిణీపై ప్రచారం
బీసీ మహిళ రిజర్వేషన్‌తో కాంగ్రెస్‌లో అంతర్గత పోటీ
రేసులో నలుగురు మహిళా కౌన్సిలర్లు
మంత్రి సీతక్క వద్ద లాబీయింగ్
క్యాంపు రాజకీయాల తర్వాత సమన్వయానికి ప్రయత్నాలు
రేపటి ఎన్నికతో తొలి చైర్మన్ ఎవరో తేలనున్న ఉత్కంఠ
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు నలుగురు మహిళా కౌన్సిలర్లు బరిలోకి దిగడంతో పార్టీ అంతర్గతంగా పోటీ ఆసక్తికరంగా మారింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరికి చైర్మన్ పదవిని రెండున్నర సంవత్సరాల చొప్పున పంచే ఫార్ములా అమల్లోకి రావచ్చన్న ప్రచారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తం 20 వార్డులు ఉన్న ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ ఐదు స్థానాలు, స్వతంత్రులు రెండు స్థానాలు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకున్నాయి. దీంతో చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. అయితే అదే పార్టీలో నలుగురు మహిళా కౌన్సిలర్లు పీఠం కోసం పోటీ పడటం నాయకత్వానికి సవాల్‌గా మారింది.
నలుగురు మహిళా నేతల మధ్య పోటీ
చైర్మన్ రేసులో నాలుగో వార్డు నుంచి గెలిచిన గుంటోజు పావని నిరంజన్ చారి, మూడో వార్డు నుంచి విజయం సాధించిన యాసం వసంత రవికుమార్, ఆరో వార్డు నుంచి గెలిచిన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, ఎనిమిదో వార్డు నుంచి ఎన్నికైన నల్లెల్ల స్వాతి భరత్ కుమార్ ప్రధానంగా ఉన్నారు. ఈ నలుగురూ తమ తమ రాజకీయ నేపథ్యం, వర్గాల మద్దతుతో మంత్రి సీతక్క వద్ద తీవ్రంగా లాబీయింగ్ చేసినట్లు సమాచారం. నల్లెల్ల స్వాతి కుటుంబానికి ప్రాంతీయంగా మంచి రాజకీయ చరిత్ర ఉండగా, గుంటోజు పావని స్వాతంత్ర్య సమరయోధుడు గుంటోజు నరసయ్య కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం ఆమెకు బలంగా మారింది. యాసం వసంత కుటుంబానికి మంత్రి సీతక్కతో సన్నిహిత సంబంధాలు ఉండగా, చంద్రకళ భర్త బిక్షపతి కూడా పార్టీకి దీర్ఘకాలంగా సేవలందిస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందారు.
క్యాంపు రాజకీయాలు… కీలక ఫార్ములా
చైర్మన్ ఎంపికపై విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి సీతక్క గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను హైదరాబాద్‌కు తరలించి క్యాంపు నిర్వహించినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం పార్టీలో సమతుల్యతను కాపాడే విధంగా ఒక కీలక ఫార్ములా రూపుదిద్దుకున్నట్లు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం నల్లెల్ల స్వాతి భరత్ కుమార్, చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి మధ్య చైర్మన్ పదవిని రెండున్నర సంవత్సరాల చొప్పున పంచే ప్రతిపాదనకు సభ్యుల నుంచి సానుకూల స్పందన లభించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇద్దరికీ అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో అసంతృప్తిని నివారించాలన్న వ్యూహం అమల్లోకి రావచ్చన్న చర్చ సాగుతోంది.
రేపటి ఎన్నికతో క్లారిటీ
ఈ ఫార్ములా అమల్లోకి వస్తే తొలి రెండున్నర సంవత్సరాలు చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది రేపటి ఎన్నికతో స్పష్టత రానుంది. ఒకే పదవిని ఇద్దరికి పంచే విధానం స్థానిక రాజకీయాల్లో అరుదుగా కనిపించే పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అంతర్గత ఐక్యతను కాపాడేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఫార్ములా భవిష్యత్తులో పార్టీ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ములుగు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరి ఖాతాలో పడుతుందన్నది రేపటి ఎన్నికతో తేలనుండగా, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.


