మహాశివరాత్రికి నిరంతర విద్యుత్
కరీంనగర్ సర్కిల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
సూపరింటెండింగ్ ఇంజనీర్ వడ్లకొండ గంగాధర్
కాకతీయ, కరీంనగర్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరా అందించినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ వడ్లకొండ గంగాధర్ తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా సర్కిల్ పరిధిలోని అన్ని శివాలయాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆలయాలు విద్యుత్ వెలుగులతో మిరుమిట్లు గొలిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముందస్తుగా లోడ్ అంచనా వేసి ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచినట్లు, విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగలకుండా కత్తిరించినట్లు వివరించారు. లైన్లు పరస్పరం తగలకుండా స్పేసర్లు అమర్చినట్లు చెప్పారు. 24 గంటల పర్యవేక్షణకు అదనపు సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. అధికారులు క్షేత్రస్థాయిలో శివాలయాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారని తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమిష్టి కృషి, నిబద్ధతతో మహాశివరాత్రి వేడుకలు విజయవంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు.


