వైభవంగా సేవాలాల్ మహారాజ్ జయంతి
బంధనపల్లి తండాలో ప్రత్యేక పూజలు
ఆకట్టుకున్న గిరిజనుల సంప్రదాయ నృత్యాలు
కాకతీయ,రాయపర్తి : మండలంలోని బంధనపల్లి తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అక్రీ రాంజీ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ ఒక మతానికో, వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని, గొప్ప సామాజిక సంస్కర్తగా నిలిచారని తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవంగా ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన సిద్ధాంతాలను పాటించాలని పిలుపునిచ్చారు. వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. ఈ వేడుకల్లో గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. భోగ్ బండార్ కార్యక్రమాలతో తండా అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తండా వాసులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


