అటా.. ఇటా ?
కార్పొరేటర్ కోసం ప్రధాన పార్టీల మధ్య పోటీ
మేయర్ పదవి కోసం మద్దతు కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నం
కరీంనగర్‌లోని కార్పొరేటర్ ఇంటి వద్ద హైడ్రామా
పెద్ద సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు
సొంత కారులో వెళ్లిపోయిన సాయి జ్యోతి
బలపరీక్ష వేళ పొలిటికల్ వార్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర రాజకీయాలు ఆదివారం ఉత్కంఠభరితంగా మారాయి. 15వ డివిజన్ కార్పొరేటర్ సాయిజ్యోతి నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్‌లో సోమవారం బలపరీక్ష నేపథ్యంలో ఆమె మద్దతు కీలకంగా మారడంతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు కార్పొరేటర్ ఇంటి వద్దకు పోటెత్తాయి. గతంలో బీజేపీలో చేరిన సాయిజ్యోతి వైఖరి ఏంటన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఇరు పార్టీల నాయకులు ఆమెను సంప్రదించేందుకు యత్నించారు. కార్యకర్తల రాకపోకలు, నినాదాలతో ఆ ప్రాంతం రాజకీయ కదలికలకు వేదికైంది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ పరిణామాల మధ్య కార్పొరేటర్ సాయి జ్యోతి తన సొంత కారులోనే ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడం మరింత చర్చకు దారి తీసింది. ఆమె ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశం ఇప్పటికీ స్పష్టతకు రాకపోవడంతో కార్పొరేషన్‌లో బలపరీక్ష ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి, ఒక కార్పొరేటర్ మద్దతు చుట్టూ కేంద్రీకృతమైన ఈ రాజకీయ సమీకరణాలు నగర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


