హుజురాబాద్‌లో బైక్ దొంగల బీభత్సం
పగలూ రాత్రి తేడా లేకుండా వరుస చోరీలు
సీసీటీవీకి చిక్కిన దృశ్యాలు
పలుచోట్ల పనిచేయని నిఘా నేత్రాలు
ఆందోళనలో ప్రజలు.. గస్తీ పెంచాలని వేడుకోలు
కాకతీయ, కరీంనగర్ : హుజురాబాద్ పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగలు హల్చల్ చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ముఖ్యంగా స్ప్లెండర్ మోటార్ సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంటి ముందర పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. పట్టపగలు, రాత్రి వేళల్లో ఈ చోరీలు జరుగుతుండటం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. విద్యానగర్ ప్రాంతంలో జరిగిన ఓ చోరీ ఘటన సీసీటీవీ కెమెరాలో నమోదైంది. అయితే పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం దొంగలకు అదనపు అవకాశంగా మారిందని స్థానికులు అంటున్నారు. ఈ లోపాన్ని ఉపయోగించుకుంటూ బైకులను ఎత్తుకెళ్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పట్టణంలో పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయని సమాచారం. దీంతో వాహన యజమానుల్లో ఆందోళన నెలకొంది. వాహనాలను బయట ఉంచాలంటే భయపడుతున్నామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పట్టణంలో సీసీటీవీ కెమెరాల పనితీరును పునరుద్ధరించి పహారా పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


