కరీంనగర్‌లో బీజేపీకి మెజారిటీ లేదు
ప్రజాస్వామ్య విధానంలోనే మేయర్ ఎన్నిక
నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం
మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మెజారిటీ లేనట్టే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే మేయర్ పదవిని ప్రకటించుకోవడం ప్రజాస్వామ్య ఆచారాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో మొత్తం 60 స్థానాల్లో బీజేపీకి 28 మాత్రమే దక్కాయని గుర్తుచేశారు. అక్కడ మెజారిటీ లేదని చెప్పినవారే, కరీంనగర్‌లో మాత్రం ముందస్తు ప్రకటనలు చేయడం విరుద్ధ ధోరణి అని విమర్శించారు.
69లో 30 సీట్లు మాత్రమే..
కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 69 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి 30 స్థానాలు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. మిగతా స్థానాలు ఇతర పార్టీలకు దక్కాయని చెప్పారు. స్పష్టమైన మెజారిటీ లేకుండానే మేయర్ అవుతామని ప్రకటించడం రాజకీయ ప్రకటన మాత్రమేనని అన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నిక
మేయర్‌ను ప్రజలచే ఎన్నుకోబడిన కార్పొరేటర్లు ప్రజాస్వామ్య విధానంలో ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల జోక్యం ఉండదని, స్థానిక ప్రజాప్రతినిధులే వారి ఆలోచనల మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇండిపెండెంట్లను కలుపుకోవడం అనైతికమా అని ప్రశ్నిస్తూ, రాజకీయాల్లో పొత్తులు సహజమని పేర్కొన్నారు. ప్రతి పార్టీకి తమ వ్యూహాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత చర్చలు జరగడం కొత్త విషయం కాదన్నారు. బీజేపీకి చెందిన 30 మంది కార్పొరేటర్లకూ, ఇతర పార్టీలకు చెందిన సభ్యులకూ శుభాకాంక్షలు తెలిపారు. మూడు లక్షల ఓటర్లున్న కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఉత్తర తెలంగాణలో ప్రముఖ కార్పొరేషన్‌గా ఉన్న కరీంనగర్‌కు మంచి పాలకవర్గం రావాలని ఆకాంక్షించారు.
16న స్పష్టత
మేయర్ ఎన్నికపై 16వ తేదీన స్పష్టత వస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినవారే మేయర్‌ను ఎన్నుకుంటారని, ఎవరినీ అడ్డుకోవాలనే ఉద్దేశం తమకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


