శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
కాకతీయ, పెద్దవంగర : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దవంగర మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘ఓం నమఃశివాయ’ నామస్మరణతో ఆలయాలు మార్మోగిపోయాయి. పెద్దవంగర శివాలయంలో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తితో దీపాలు వెలిగించి తమ కోరికలు తీర్చాలని పరమశివుడికి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నవంగర, వడ్డెకొత్తపల్లి గ్రామాల్లోని పురాతన శివాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. గర్భాలయంలో స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగగా, భక్తి పారవశ్యంలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


