పరీక్షలంటే భయం కాదు.. ధైర్యంగా ఎదుర్కోండి
మానసిక ధైర్యంతోనే పబ్లిక్ పరీక్షల్లో విజయం :
మోటివేషనల్ స్పీకర్, రిటైర్డ్ ఎంఈఓ బిక్షపతి
సాయి స్పందన హైస్కూల్‌లో విద్యార్థులకు మోటివేషన్
కాకతీయ, హనుమకొండ : విద్యార్థులు పరీక్షలంటే భయపడకుండా ఆత్మవిశ్వాసంతో సిద్ధమవ్వాలని ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, రిటైర్డ్ ఎంఈఓ బిక్షపతి సూచించారు. వడ్డేపల్లిలోని సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సాయి స్పందన హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల సమయంలో మానసిక ధైర్యం, ఏకాగ్రత ఎంతో ముఖ్యమని తెలిపారు. సరైన ప్రణాళికతో చదివితే పరీక్షలను సులభంగా రాయగలరన్నారు. భయం, ఆందోళనలను దూరం చేసుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. పబ్లిక్ పరీక్షల్లో విజయానికి పాటించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలపై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల కరస్పాండెంట్ మాడూరి శ్రీనివాసరావు, కార్యదర్శి లింగమూర్తి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


