కరుణాపురం చర్చిలో చోరీ
అనుమానితుల ఫోటోలు విడుదల
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. కరుణాపురం గ్రామంలోని చర్చిలో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చిన మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు అపహరణకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హనుమకొండ భీమారం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఆదివారం కరుణాపురం చర్చిలో ప్రార్థనలకు హాజరయ్యారు. ప్రార్థనలు అనంతరం బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని మహిళలు ఆమె మెడలోని పుస్తెలతాడును చాకచక్యంగా అపహరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ధర్మసాగర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా దృశ్యాలు, స్థానికుల సమాచారం ఆధారంగా చోరీకి పాల్పడిన ఇద్దరు అనుమానిత మహిళలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి ఫోటోలను విడుదల చేస్తూ ప్రజల సహకారం కోరారు. ఈ మహిళలను ఎవరైనా గుర్తిస్తే వెంటనే 8712685127 నంబర్‌కు సమాచారం అందించాలని ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.


