జమ్మికుంట పీఠంపై ఉత్కంఠ
మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు
బీఆర్ఎస్‌కు కావాల్సింది మరో ఇద్దరి మద్దతు
కాంగ్రెస్‌కు కావాల్సింది మరో ఆరుగురి మద్దతు
ముగ్గురు ఇండిపెండెంట్లు,ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్ మద్దతు సాధించినట్లు ప్రచారం
బీజేపీ, బీఆర్ ఎస్ కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు బంపర్ ఆఫర్లు
కీలకంగా మారిన బీజేపీ కౌన్సిలర్ల మద్దతు..!!
క్యాంపు రాజకీయాలతో మారుతున్న సమీకరణాలు
తెరవెనుక కీలకమైన ప్రణవ్ వ్యూహాలు అమలు
చివరి నిమిషం వరకూ ఉత్కంఠ.. చైర్మన్ పోరుపై హైటెన్షనే..!
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు హంగ్ వైపు దారితీయడంతో చైర్మన్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 30 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీఆర్‌ఎస్ 12 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 10 స్థానాలు, బీజేపీ 4, స్వతంత్రులు 3, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్థానంలో విజయం సాధించాయి. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అధికార సమీకరణాల కోసం తీవ్ర రాజకీయ కసరత్తు కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే బీఆర్‌ఎస్‌కు మరో ఇద్దరి నుంచి నలుగురి వరకు మద్దతు అవసరమవుతుండగా, కాంగ్రెస్‌కు ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు స్వతంత్రులు, ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్ మద్దతు కీలకంగా మారింది. కొందరు స్వతంత్రులు, ఇతర పార్టీల కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీకి చెందిన నలుగురు కౌన్సిలర్ల నిర్ణయం కూడా చైర్మన్ పీఠాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారింది.
క్యాంపు రాజకీయాలు, వ్యూహాత్మక కదలికలు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లు సమాచారం. బేరసారాలను అడ్డుకునేందుకు కౌన్సిలర్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వం స్వతంత్రులు, ఇతర పార్టీల సభ్యులతో వరుసగా సంప్రదింపులు జరుపుతూ తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమీకరణాల్లో కాంగ్రెస్ నాయకుడు ప్రణవ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చివరి నిమిషం వరకు ఉత్కంఠ
బీఆర్‌ఎస్ కూడా తమ బలాన్ని కాపాడుకునేందుకు ప్రతివ్యూహాలు అమలు చేస్తోంది. క్రాస్ ఓటింగ్ అవకాశాలు, చివరి నిమిషం చర్చలు, మద్దతు మార్పులు వంటి అంశాలు చైర్మన్ ఎన్నికను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. చైర్మన్ ఎన్నిక జరిగే వరకు పరిస్థితులు ఎటు మారుతాయోనన్న ఉత్కంఠ నెలకొనగా, జమ్మికుంట మున్సిపల్ పీఠం ఎవరి ఖాతాలో పడుతుందో చూడాలని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


