ఎందుకు ఓడాం ?
అధికార పార్టీలో అంతర్మథనం
మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన
ఎన్నికల్లో ఓటమిపై కేడర్ నారాజ్
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీకి నిరాశను మిగిల్చాయి. బీఆర్ఎస్ విజయంసాధించడంతో ఫలితాలపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల పట్టణ ప్రజల సంపూర్ణ ఆదరణను పొందడంలో విఫలమయ్యామనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లను ఆకర్షించడంలో వ్యూహాత్మక లోపాలు చోటుచేసుకున్నాయనే చర్చ సాగుతోంది.
నాయకత్వ లోటు… ప్రచారంలో సమన్వయ లోపం
ఎన్నికల సమయంలో అభ్యర్థులను ముందుండి నడిపించే బలమైన స్థానిక నాయకత్వం కనిపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వార్డు స్థాయిలో సమన్వయం లేకపోవడం, ప్రచార కార్యక్రమాల్లో స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోవడం ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రుల సభలు కూడా ఆశించినస్థాయిలో ప్రజలను ఆకర్షించలేకపోయాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించే ప్రసంగాలు, స్థానిక సమస్యలపై స్పష్టమైన హామీలు ఇవ్వడంలో లోటు కనిపించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అభ్యర్థుల ఎంపికలో లోపాలపై చర్చ
స్థానిక సమీకరణాలు, వ్యక్తిగత ఇమేజ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. గ్రౌండ్ స్థాయిలో బలమైన అభ్యర్థులు కాకపోవడంతో నష్టం జరిగిందని పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా తగిన వ్యూహం లేకపోవడం వల్ల ఓట్లు బదలాయింపు చోటుచేసుకున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
సంక్షేమ పథకాల ప్రభావం ఏదీ?
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్ని వార్డుల్లో సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో లోటు ఉన్నట్లు భావిస్తున్నారు. అధికార పార్టీగా ఉన్న ప్రయోజనాన్ని ప్రచారంలో పూర్తిగా వినియోగించుకోలేకపోయామని కొందరు నేతలు ఒప్పుకుంటున్నారు. ప్రతి ఇంటికీ చేరే విధంగా డోర్ టు డోర్ ప్రచారం, లబ్ధిదారులతో ప్రత్యక్ష సంప్రదింపులు మరింత బలంగా నిర్వహించి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోలేకపోయారా?
గత బీఆర్ఎస్ కౌన్సిలర్లపై వచ్చిన అవినీతి ఆరోపణలు, అహంకార ధోరణి, ప్రజలతో దూరం పెరగడం వంటి అంశాలను బలంగా ఎత్తిచూపి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ, ఆ వ్యతిరేకతను సమర్థంగా ఓట్లుగా మలచుకోలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఏకీకృత ఓటుగా మార్చే వ్యూహం లోపించిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అంతర్గత సమీక్షకు సన్నాహాలు
ఫలితాల అనంతరం పార్టీలో సమీక్ష సమావేశాలు నిర్వహించి లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. బూత్ స్థాయి వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, స్థానిక సమస్యలపై నిరంతర పోరాటం చేయడంవంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
ముందున్న రాజకీయ సవాళ్లు
మున్ముందు పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రజలతో నిరంతర సంబంధం, బాధ్యతాయుత పాలన, స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోతే పట్టణ రాజకీయాల్లో స్థిరపడడం కష్టమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.మొత్తంగా, అధికారంలో ఉన్నప్పటికీ సిరిసిల్ల పట్టణ ప్రజల మద్దతును సాధించడంలో ఎదురైన సవాళ్లపై కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్మథనం భవిష్యత్ రాజకీయ దిశను నిర్ణయించనుంది.


