ములుగు మున్సిపల్ పీఠం ఎవరికి..?
కాంగ్రెస్‌లో నలుగురు మహిళా కౌన్సిలర్ల మధ్య పోటీ
బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పెరిగిన ఆసక్తి
చైర్మన్ పీఠానికి ఆశావహుల లాబీయింగ్ ముమ్మరం
మంత్రి సీతక్క నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పీఠం కోసం పోటీ తీవ్రంగా మారింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు మహిళా కౌన్సిలర్లు పీఠం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నాలుగో వార్డు నుంచి గెలిచిన గుంటోజు పావని నిరంజన్ చారి, మూడో వార్డు నుంచి గెలిచిన యాసం వసంత రవికుమార్, ఆరో వార్డు నుంచి గెలిచిన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, ఎనిమిదో వార్డు నుంచి గెలిచిన నల్లెల్ల స్వాతి భరత్ కుమార్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకోగా, టీఆర్ఎస్ 5, స్వతంత్రులు 2, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.
చైర్మన్ పీఠం కోసం లాబీయింగ్ ముమ్మరం
చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు తమ తమ వర్గాల మద్దతుతో మంత్రి సీతక్కను కలుస్తూ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నల్లెల్ల స్వాతి భరత్ కుమార్ కుటుంబానికి ప్రాంతీయంగా రాజకీయ ప్రాధాన్యం ఉండగా, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీగా పనిచేసిన వారి కుటుంబానికి పదవి ఇవ్వాలని అనుచరులు కోరుతున్నట్లు తెలిసింది. అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు గుంటోజు నరసయ్య కుటుంబానికి చెందిన గుంటోజు పావని నిరంజన్ చారి కుటుంబ సభ్యులు కూడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రి సీతక్కతో దీర్ఘకాల రాజకీయ అనుబంధం కలిగిన యాసం వసంత రవికుమార్ కుటుంబం కూడా చైర్మన్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. మరోవైపు మంత్రి సీతక్కకు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నాయకుడు బిక్షపతి తన సతీమణి చంద్రకళకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మంత్రి నిర్ణయంపై ఆసక్తి
చైర్మన్ ఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను క్యాంపులో ఉంచినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అనుసరించి చైర్మన్ ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది. నలుగురు మహిళా కౌన్సిలర్ల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా మారడంతో మంత్రి సీతక్క ఎవరికి అవకాశం కల్పిస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సోమవారం జరగనున్న చైర్మన్ ఎన్నిక ఫలితంపై జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ములుగు మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది రాజకీయంగా కీలకంగా మారింది.


